Lok Sabha : జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు. రేపు లోక్‌సభ(Lok Sabha)లో జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్ర హోదాపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం రాజ్యసభలో బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఆరేళ్లు కావొస్తోంది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి.. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(Union Territories)గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. తిరిగి జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతున్నారు. దాంతో, జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాపైనే చర్చలు జరుగుతున్నాయనే కథనాలు జోరందుకున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఆగస్టు 20 బుధవారం లోక్ సభలో అమిత్ షా జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.