న్యూఢిల్లీ, మే 7: భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఉత్తర్వు లు జారీచేశారు. సెలవులపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాల చీఫ్‌లను ఆయన ఆదేశించారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ అంతర్గత భద్రతపై అమిత్ షా సమీక్ష నిర్వహించారని, ఉన్నతాధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, కఠినమైన నిఘా చేపట్టాలని ఆ సమావేశంలో అమిత్ షా వారిని కోరారు. అలాగే దేశ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న జమ్ముకశ్మీర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ఎల్జీ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాకు అమిత్ షా సూచించారు.