ఒట్టావా, అక్టోబర్ 30: కెనడా మరోసారి భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా తమ దేశంలో హింసాత్మక దాడులు, బెదిరింపులకు భారత హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారని కెనడా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించారు. ఈ మేరకు డిప్యూటీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డేవిడ్ మారిసన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. కాగా, ట్రూడో రక్షణ సలహాదారు నథాలీ డ్రౌయిన్ మంగళవారం కమిటీ ముందు మాట్లాడుతూ కెనడాలో ఉన్న దౌత్యవర్గాల ద్వారా భారత్ భారతీయులు, కెనడా పౌరుల వివరాలు సేకరించినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
కొవిడ్‌ను మించిన ప్రాణాంతక వ్యాధి క్షయ ; ప్రపంచంలో 26 శాతం కేసులు భారత్‌లోనే
న్యూఢిల్లీ : ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ప్రపంచ క్షయ వ్యాధి నివేదిక, 2024 ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో 2023లో నమోదైన కేసుల్లో 26 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా (10 శాతం), చైనా (6.8 శాతం), ఫిలిప్పీన్స్ (6.8 శాతం), పాకిస్థాన్ (6.3 శాతం) ఉన్నాయి. క్షయ వ్యాధి సంబంధిత మరణాల సంఖ్య 2022లో 13.2 లక్షలు కాగా, 2023లో కాస్త తగ్గి, 12.5 లక్షలుగా నమోదైంది.