Maharastra CM | ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మహారాష్ట్రలో సీఎం ఎవ్వరన్న సందిగ్ధం కొనసాగుతున్నది. బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లతో కూడిన మహాయుతి కూటమికి మెజారిటీ వచ్చినా సీఎం ఎవరన్న సంగతి తేలలేదు. సీఎం అభ్యర్థి ఖరారు విషయమై గురువారం దేశ రాజధానిలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ జరిగింది. అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ నేతే సీఎం కావాలని పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా, ఆ పార్టీ నాయకత్వం మౌనం వీడలేదు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ని సీఎం చేయాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం పదవిపై ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే పెదవి విప్పారు. సీఎం పదవిపై బీజేపీ నాయకత్వం నిర్ణయాన్ని ఆమోదిస్తానని బుధవారం సంకేతాలిచ్చారు.
ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీకి చేరుకున్న ఏక్ నాథ్ షిండే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నడ్డా, ఏక్ నాథ్ షిండే భేటీ అయ్యారు. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎన్సీపీ నేత సునీల్ తాత్కారే నివాసంలో ఫడ్నవీస్, అజిత్ పవార్ సమావేశం అయ్యారు.