Amit Shah : కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ దళిత నాయకురాలు కుమారి షెల్జాను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించారు. దళిత నేతలను అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు.
రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో ‘దేశం అభివృద్ధి జరిగిన తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదు. వాటిని తొలగిస్తాం’ అని అన్నారని, రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన మాటలే చెబుతున్నాయని షా అన్నారు. కేవలం మోదీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన రిజర్వేషన్లను కాపాడగలరని అమిత్ షా చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని, ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తామని చెప్పారని తెలిపారు.
‘రాహుల్‌కి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. ‘రాహుల్ బాబా మీకే కాదు.. మీ మూడోతరం వచ్చినా ఆర్టికల్ 370 తిరిగి రాదు’ అని చెప్పాలనుకుంటున్నా. ఆర్టికల్ 370 ఇప్పుడు చరిత్రగా మారింది. మీ తాత కాలంలో ఆర్టికల్ 370 అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్‌గా ఉంది. ఆ క్వశ్చన్‌మార్క్‌ను నరేంద్ర మోదీ తొలగించేశారు. అదిక తిరిగిరాదు’ అని షా వ్యాఖ్యానించారు. హర్యానా ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి హర్యానానే ఉదాహరణ అని అన్నారు.
గతంలో హర్యానాలో రెండు వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తూ పోతుండేవి. ఒక పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి పెరిగిపోయింది. మరో పార్టీ అధికారంలోకి రాగానే గూండాయిజం పెరిగింది. రెండు పార్టీల్లోనూ ఆశ్రిత పక్షపాతం, కులతత్వం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకముందు ఉద్యోగం పొందాలంటే కచ్చితంగా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’ అని రాహుల్‌గాంధీ అన్నారు.