న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏండ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. నిర్దోషిగా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమిత్ జోగి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2003 జూన్ 4న రాయ్‌పూర్‌లో ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్యకు గురయ్యారు. అప్పట్లో అమిత్ జోగి తండ్రి అజిత్ జోగి సీఎంగా ఉన్నారు.
శాసనసభ ఎన్నికల ముందు జరిగిన ఈ హత్య, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో 2007లో ట్రయల్ కోర్టు, సాక్ష్యాలు సరిగా లేవంటూ అమిత్ జోగిని నిర్దోషిగా విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును పునర్విచారించిన హైకోర్టు, మార్చి 2న అమిత్ జోగిని దోషిగా తేల్చింది. ‘ఈ హత్య కుట్రకు అమిత్ జోగినే సూత్రధారి’ అని హైకోర్టు తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.