Belgaum Assembly | కర్ణాటక-మహరాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా సద్దుమణగలేదు. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి రవాణా వాహనాలు పోలీసు బందోబస్తు మధ్య వెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. బెళగాం తమకంటే తమకంటూ ఇరు రాష్ట్రాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో బెళగాంలో రేపటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
కర్ణాటక శాసనసభ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు బెళగాంలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనంలో జరుగనున్నాయి. బెళగాం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, ఇక్కడే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉద్రిక్త వాతావారణం నెలకొన్నది. బెళగాం, ఖానాపూర్, నిప్పాణి, నందగడ్, కార్వార్ సరిహద్దు విషయంలో మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్నది.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెళగాంలో జరిగే ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి సెషన్. డిసెంబరు 30వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. అనేక సమస్యలపై అధికార, విపక్షాలు పరస్పరం దాడి, ప్రతిదాడికి దిగడం వంటి అంశాలతో హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని పరిపాలనకు ఈ సెషన్ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఎన్నికల ప్రకటనకు ముందు ఉమ్మడి సెషన్, బడ్జెట్ సెషన్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 2023 ఏప్రిల్-మే నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.