చండీగఢ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల మతపరమైన ఊరేగింపు సందర్భంగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగాయి. అవి గురుగ్రామ్ వరకు వ్యాపించాయి. ఈ ఉద్రిక్తతల నడుమ హిందూ సమాజ్ మహాపంచాయత్ (Haryana Mahapanchayat) ఆదివారం జరిగింది. సుమారు వెయ్యి మంది వరకు ఇందులో పాల్గొన్నారు. అయితే, హిందూ సమాజ్ ఏర్పాటు చేసిన ఈ మహాపంచాయత్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీస్ అధికారి తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుతామని నిర్వాహకులు తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మహాపంచాయత్‌కు సంబంధించి అన్ని వర్గాలతో మాట్లాడినట్లు వెల్లడించారు.
కాగా, నూహ్ జిల్లాలో జరిగిన మతపరమైన ఘర్షణల వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉండవచ్చని హర్యానా పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌లో ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. హింసాత్మక సంఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తున్నదని, అన్ని కోణాలను పరిశీలిస్తున్నదని పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆక్రమణదారులకు ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. వారిలో కొందరు అల్లర్లలో పాల్గొన్నారని వెల్లడించారు.