లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) కీలక నిర్ణయం తీసుకున్నది. రీసెర్చ్ స్కాలర్‌పై అత్యాచారం కేసు విచారణ ఎదుర్కొంటున్న పోలీసు అధికారి మహ్మద్ మొహ్సిన్ ఖాన్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను రద్దు చేసింది. యూపీ డీపీజీ కార్యాలయం సిఫార్సు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. డీజీపీ కార్యాలయం నుంచి ఆమోదం పొందిన తర్వాత ఖాన్ పీహెచ్డీ ప్రోగ్రామ్ రద్దు చేసినట్లు వెల్లడించారు.
కాగా, కాన్పూర్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పనిచేస్తున్న మొహమ్మద్ మొహ్సిన్ ఖాన్, ఐఐటీ కాన్పూర్‌లో సైబర్ క్రైమ్, క్రిమినాలజీలో పీహెచ్డీ చేస్తున్నాడు. అయితే అదే విద్యాసంస్థకు చెందిన మహిళా రీసెర్చ్ స్కాలర్‌తో సంబంధాన్ని పెంచుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మాట తప్పడంతో ఆ పోలీస్ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీస్ అధికారి ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేయడానికి కాన్పూర్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసి పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. డిసెంబరు 19న అలహాబాద్ హైకోర్టు ఖాన్ అరెస్టుపై స్టే విధించడంతో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది.