చెన్నై: తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్ టూర్ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు చిక్కుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. (Tamil Nadu students stranded in J&K) వారిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్‌లోని పలు విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు స్టడీ టూర్ కోసం జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు.
కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో జమ్ముకశ్మీర్‌లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో తమిళనాడుకు చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. అయితే స్టడీ టూర్‌కు వెళ్లిన నలుగురు రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరుకున్నారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 52 మంది విద్యార్థుల అభ్యర్థనల మేరకు వారిని అక్కడ నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న విద్యార్థులను సంప్రదించి వారు తిరిగి వచ్చేలా చూడాలని ఢిల్లీలోని తమిళనాడు హౌస్ కమిషనర్ ఆశిష్ కుమార్, పుదుకోట్టై జిల్లా అదనపు కలెక్టర్ అఫ్తాబ్ రసూల్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. సహాయం కోసం 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లను (011-24193300 (ల్యాండ్‌లైన్), 9289516712 (వాట్సాప్‌తో మొబైల్ నంబర్) తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.