ఇంఫాల్: కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో (Manipur) మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో కేంద్ర బలగాల మొత్తం కంపెనీల సంఖ్య 288కు చేరుతుందని పేర్కొంది. మణిపూర్ భద్రతా సలహాదారుడు కుల్దీప్ సింగ్ శుక్రవారం రాజధాని ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. 10,800 మంది కేంద్ర బలగాల సిబ్బందితో మరో 90 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీల బలగాలు చేరాయని చెప్పారు. దీంతో మణిపూర్‌లో మోహరించిన మొత్తం కంపెనీల సంఖ్య 288కు పెరుగుతుందని వెల్లడించారు.
కాగా, పౌరుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి ఉద్రిక్త ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలిస్తున్నట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు. కొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు ఇవి చేరుతాయని చెప్పారు. ప్రతి జిల్లాలో కొత్త కోఆర్డినేషన్ సెల్స్, జాయింట్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వాటి పనితీరును సమీక్షించినట్లు వెల్లడించారు.