AMCA : రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ల తయారీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్డీవో (DRDO)-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) దీనిని అమలు చేయనుంది. అమ్కా (AMCA) ను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలువనుంది.
భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) నమూనాను తొలిసారి ‘ఏరో ఇండియా-2025’లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేథ (AI) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల లాంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు.
ఏడీఏ ఈ యుద్ధ విమానం డిజైన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.