సోమవారం 25 జనవరి 2021
National - Dec 01, 2020 , 17:59:06

అంద‌నంత ఎత్తులో అంబానీలు

అంద‌నంత ఎత్తులో అంబానీలు

ముంబై: అంబానీలు త‌మ వ్యాపార సామ్రాజ్యాన్ని శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్నారు. ఎంత‌లా అంటే ఆసియాలో రెండో అత్యంత ధ‌న‌వంతులైన కుటుంబ సంప‌ద కంటే అంబానీల‌ సంప‌ద రెట్టింపు ఉండ‌టం విశేషం. ఈ ఏడాది క‌రోనా మ‌హమ్మారి చాలా మంది కుబేరుల త‌ల‌రాత‌ల‌ను మారిస్తే.. అంబానీలు మాత్రం త‌మ సంప‌ద‌ను మ‌రింత పెంచుకున్నారు. రిఫైన‌రీల నుంచి మెల్ల‌గా టెక్నాల‌జీ అనుబంధ వ్యాపారంపై క‌న్నేసిన అంబానీ కుటుంబం.. 2020లో భారీగానే ఆర్జించిన‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ తాజా నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. ఈ సంపాద‌న ఆసియాలో రిచెస్ట్ ప‌ర్స‌న్ ముకేశ్ స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేయ‌డ‌మే కాదు.. రెండో స్థానంలో ఉన్న క్వోక్స్ కుటుంబం కంటే రెట్టింపు సంప‌ద‌తో అంద‌నంత ఎత్తుకు చేరుకోవ‌డంలో తోడ్ప‌డింది. ఈ ఏడాది త‌న జియో సంస్థ‌కు భారీగా పెట్టుబ‌డులు స‌మ‌కూర్చ‌డంలో ముకేశ్ విజ‌య‌వంత‌మ‌య్యారు. త‌మ వ్యాపార సామ్రాజ్య విస్త‌ర‌ణ‌కు ఇది బాగా దోహ‌ద‌ప‌డింది. రెండో స్థానంలో ఉన్న క్వోక్స్ కుటుంబం కంటే రెట్టింపు, మూడోస్థానంలో ఉన్న సౌత్ కొరియాకు చెందిన లీ కుటుంబం కంటే మూడు రెట్లు, జపాన్‌కు చెందిన టోరీ అండ్ సాజీ కంటే ఐదు రెట్ల ఎక్కువ సంప‌ద అంబానీల ద‌గ్గ‌ర ఉండ‌టం విశేషం. అంబానీల మూడు త‌రాల సంప‌ద మొత్తం విలువ 7600 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.5.6 ల‌క్ష‌ల కోట్లు)గా ఉంది. గ‌తేడాది జులైలో బ్లూమ్‌బ‌ర్గ్ ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంబానీల సంప‌ద 2500 కోట్ల డాల‌ర్లు పెర‌గ‌డం విశేషం. ఆసియాలోని టాప్ 20 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంప‌ద మొత్తం 46300 కోట్ల డాల‌ర్లు (సుమారు రూ.34 ల‌క్ష‌ల కోట్లు)గా ఉంది. అంబానీల త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న క్వోక్స్ కుటుంబ సంప‌ద 3300 కోట్ల డాల‌ర్లు కాగా.. మూడో స్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌కు చెందిన చియార‌వ‌నోంట్ కుటుంబ సంప‌ద 3170 కోట్లుగా ఉంది. 


logo