శ్రీనగర్: హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర అనేక ఆటంకాల నడుమ కొనసాగుతున్నది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాల నుంచి కొనసాగుతున్న యాత్రను ఒక రోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగా ట్రెక్కింగ్ మార్గాలు జారడంతోపాటు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నదని, ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమవుతుందన్నారు.
భారీ వర్షాల కారణంగా రెండు మార్గాల్లో ఉన్న ట్రాక్‌లను పునరుద్ధరించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) తన సిబ్బంది, యంత్రాలను భారీగా మోహరించింది. శుక్రవారం రెండు బేస్ క్యాంపులను యాత్ర ప్రారంభమయ్యే సమయానికి ట్రాక్‌లను బాగుచేయాలని అధికారులు వెల్లడించారు.
కాగా, కుండపోతగా కురుస్తున్న వానలతో బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ మహిళా భక్తురాలు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఒక్కసారిగా వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో యాత్రికులు వరదల్లో చిక్కుకున్నారు. మరణించిన మహిళను రాజస్థాన్‌కు చెందిన సోనా బాయి(55)గా గుర్తించారు. అయితే ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర 15 రోజులకు చేరింది.