న్యూఢిల్లీ, మార్చి 5 : ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్ర 2025లో జూలై 3న ప్రారంభమవుతుందని ‘శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డ్’ (ఎస్ఏఎస్బీ) తెలిపింది. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగుతుందని, ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగుస్తుందని బోర్డు అధికారులు మీడియాకు తెలిపారు. మంగళవారం జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో జరిగిన 48వ ఎస్ఏఎస్బీ బోర్డు సమావేశంలో యాత్ర షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. ‘ఈ ఏడాది కూడా రెండు మార్గాల్లో యాత్ర ఏకకాలంలో మొదలవుతుంది. అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ మార్గం, గండేర్బల్లోని బాల్టల్ దారిలో మొదలయ్యే యాత్ర ఆగస్టు 9తో ముగస్తుంది’ అని బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు.