Honeymoon Murder : భార్యతో కలిసి హనీమూన్‌కు వచ్చి మేఘాలయ (Meghalaya) లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న వార్త తనను షాక్‌కు గురిచేసిందని, తాను నమ్మలేకపోయానని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) ప్రెస్టోన్ టిన్సోంగ్ (Prestone Tynsong) అన్నారు. మేఘాలయ రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున దేశంలోని పర్యాటకులందరికి తాను మనవి చేస్తున్నానని, తమ రాష్ట్రం పర్యాటకులకు సురక్షిత ప్రదేశమని చెప్పారు.
ఈ హత్య ఘటనను కారణంగా చూపుతూ కొంతమంది మేఘాలయ టూరిస్టులకు సురక్షితం కాదనే దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దని, టూరిస్టులు నిస్సంకోచంగా తమ రాష్ట్రంలో పర్యటించాలని డిప్యూటీ సీఎం కోరారు. కాగా భార్యతో కలిసి మేఘాలయకు హనీమూన్ ట్రిప్‌కు వెళ్లిన రాజా రఘువంశీ అనే మధ్యప్రదేశ్ వాసి గత నెల 23న హత్యకు గురయ్యాడు.
రాజా రఘవంశీ భార్య సోనమ్ రఘువంశీనే తన భర్తను కిరాయి హంతకులను పెట్టి హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. తన భర్త తనను రక్షించే క్రమంలో హత్యకు గురయ్యాడని సోనమ్ రఘువంశీ సోమవారం వెల్లడించారు. ఇదిలావుంటే రాజా రఘువంశీ తలకు ముందు, వెనుక భాగాల్లో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.