రాయ్‌పూర్: అలయన్స్ ఎయిర్ విమానం ల్యాండింగ్ సమయంలో దాని టైర్ పేలింది. దీంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. అయితే వారంతా సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత ప్రయాణం కోసం ఆ విమానాన్ని రద్దు చేసినట్లు ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. (flight’s tyre bursts) ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఈ సంఘటన జరిగింది. అలియన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బిలాస్పూర్ చేరుకున్నది. అయితే అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఆ విమానం టైర్ బరస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులు భయాందోళన చెందారు.
కాగా, ఆ విమానంలోని 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా మొత్తం 41 మంది క్షేమంగా ఉన్నట్లు అలయన్స్ ఎయిర్ అధికారి తెలిపారు. ల్యాండింగ్ సమయంలో విమానం ఎడమ వైపు టైర్ పంక్చర్ అయ్యిందని చెప్పారు. ఈ సంఘటన తర్వాత ప్రయాణికులు, సిబ్బందిని రన్‌వే నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి టెర్మినల్ భవనానికి తరలించినట్లు వివరించారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో బిలాస్పూర్ నుంచి ఆ విమానం తదుపరి ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్డ్‌ను రద్దు చేసినట్లు అలయన్స్ ఎయిర్ అధికారి తెలిపారు. అయితే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఈ సంఘటనపై నివేదికను కోరడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించింది.