పాట్నా: నీట్ రీటెస్ట్‌లో అవకతవకలు బయటపడ్డాయి. అభ్యర్థులకు బదులు కొందరు మెడికల్, నర్సింగ్ విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ ఉద్యోగులు వీరికి సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ ముఠాకు చెందిన 24 మందిని అరెస్ట్ చేశారు. (NEET cheating) బీహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే మెడికల్ విద్యార్థి, నీట్ అభ్యర్థికి బదులు పరీక్ష రాసేందుకు హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. బయోమెట్రిక్ సంస్థ ఉద్యోగిగా నమ్మించి లోనికి ప్రవేశించాడు.
కాగా, పరీక్షా నిర్వాహకులు అనుమానించడంతో తొలుత మయాంక్ కశ్యప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సమాచారం ఆధారంగా లఖీసరాయ్‌లోని కేఆర్కే హయ్యర్ సెకండరీ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్స్‌పై పోలీసులు రైడ్ చేశారు. దీంతో అసలు అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాస్తున్న ప్రాక్సీ నెట్వర్క్ గుట్టురట్టయ్యింది. వైద్య, నర్సింగ్ విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
దీంతో అసలు అభ్యర్థులకు బదులు పరీక్షలు రాసిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నర్సింగ్ విద్యార్థిని పూనమ్ కుమారి, ఎయిమ్స్ రాయ్‌బరేలీ విద్యార్థి సౌరభ్ ఝా, ఢిల్లీలోని షాదారా మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న అమన్ అగర్వాల్, నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థి సంజీత్, అతడి సోదరుడు, ఏడుగురు అసలు అభ్యర్థులు, బయోమెట్రిక్ సంస్థకు చెందిన 14 మంది ఉద్యోగులతో సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, అసలు అభ్యర్థుల స్థానంలో శిక్షణ పొందిన సాల్వర్లతో పరీక్ష రాయించేందుకు ఈ చీటింగ్ ముఠా ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గయలోని ఏఎన్ఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన మెడికల్ విద్యార్థి అర్పిత్ రాజ్ ఈ నెట్వర్క్ సూత్రధారులలో ఒకరని అనుమానిస్తున్నారు. గతంలో 2024 నీట్ పేపర్ లీక్ కేసులో కూడా సీబీఐ అతడ్ని విచారించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నెట్వర్క్ పరిధితో పాటు ఇందులో ప్రమేయం ఉన్న మిగతా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
అయితే నీట్ రీటెస్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ అవకతవకలు ఎలా జరిగాయి? నీట్ పరీక్షల సమయంలో వైద్య విద్యా సంస్థలు నియంత్రణలు విధించినప్పటికీ వైద్య విద్యార్థులు ఎలా పాల్గొన్నారు? అన్న సందేహాలు కలుగుతున్నాయి.