బెంగళూరు: అక్రమ మైనింగ్ లీజ్ ఆరోపణల కేసులో కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామిని విచారించేందుకు, చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతించాలని కర్ణాటక లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గవర్నర్ గెహ్లాట్‌ను కోరింది. ఈ మేరకు ప్రతిపాదనను సిట్ సోమవారం మరోసారి సమర్పించింది. కుమారస్వామిని విచారించేందుకు సిట్ తొలిసారిగా గత ఏడాది నవంబర్లోనూ గవర్నర్ అనుమతి కోరింది. అయితే అప్పుడు అనుమతి ఇవ్వలేదు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కుమారస్వామి కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో 2007లో చట్టవిరుద్ధంగా శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ అనే కంపెనీకి బళ్లారి జిల్లా సందూర్ తాలూకా భవిహల్లిలో 550 ఎకరాల్లో మైనింగ్ లీజ్ కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. లీజ్ కోసం దరఖాస్తు చేసుకొన్న 24 కంపెనీలను కాదని సదరు కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
తాజా పరిణామంపై కుమారస్వామి, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కేసులో కుమారస్వామిని ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఉంటే, ఎలాంటి సంకోచం లేకుండా ఆయన్ను అరెస్టు చేస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతిస్తారేమోనని కుమారస్వామి భయపడుతున్నారని అన్నారు. సీఎం వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ‘నన్ను అరెస్టు చేసేందుకు 100 మంది సిద్ధరామయ్యలనైనా రానివ్వండి. నన్ను చూస్తే భయపడుతున్నానని మీరు అనుకొంటున్నారా?’ అని పేర్కొన్నారు.