బెంగళూరు, సెప్టెంబర్ 3: కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మెడకు మరో భూకుంభకోణం చుట్టుకుంటున్నది. తన సన్నిహితులకు చెందిన సంస్థకు పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అప్పనంగా భూమిని కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీజేపీ నేత చలవాది నారాయణస్వామి కీలక విషయాలను వెల్లడించారు. బగ్మనే డెవెలపర్స్ అనే సంస్థ నుంచి రూ.4 కోట్ల అప్పు తీసుకున్నట్టు ఎంబీ పాటిల్ తన 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ బగ్మనే డెవెలపర్స్లో డైరెక్టర్లుగా ఉన్న రాజా బగ్మనే, వెంకటరామప్ప రామకృష్ణ అనే ఇద్దరు వైగై ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీకి సైతం డైరెక్టర్లుగా ఉన్నారు. ఎంబీ పాటిల్ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాక ఈ వైగై సంస్థకు హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్కులోని కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ)కి చెందిన 7.8 ఎకరాల భూమిని కేటాయించారు. మంత్రి కుమారుడికి చెందిన మరో కంపెనీకి సైతం భూకేటాయింపు జరిగిందని చలవాది ఆరోపించారు. అయితే, భూకేటాయింపు నిబంధనల మేరకే చేసినట్టు ఎంబీ పాటిల్ తెలిపారు.