న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) ఓ రేప్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరీ చేసింది. అత్యాచారానికి గురైన మహిళే.. ఆ సమస్యకు కారణమైందని కోర్టు అభిప్రాయపడింది. ఆమె సమస్యకు ఆమే బాధ్యురాలు అని కోర్టు పేర్కొన్నది. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆ కేసులో తీర్పును వెలువరించారు.
2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని హౌజ్ ఖాస్ బార్లో ఓ మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అయితే ఆ వ్యక్తే తనను రేప్‌కు గురి చేసినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 2024లో నిందితుడిని అరెస్టు చేశారు. ఆ కేసులో ఇవాళ అలహాబాద్ హైకోర్టు తీర్పుఇచ్చింది.
ఒకవేళ బాధితురాలు చెప్పిన విషయాలన్నీ నిజమే అయినా.. ఆ సమస్యకు కారణం ఆమే అని కోర్టు చెప్పింది. ఆమె సమస్యను ఆమే ఆహ్వానించిందని న్యాయమూర్తి తెలిపారు. బాధితురాలి హైమెన్ పొరకు డ్యామేజ్ అయినా.. అది లైంగిక దాడి వల్లే జరిగినట్లు డాక్టర్లు ద్రువీకరించలేకపోయారు. ఆ మెడికల్ రిపోర్టును కోర్టు పరిగణలోకి తీసుకున్నది.
ముగ్గురు మహిళా మిత్రులతో కలిసి బార్‌కు వెళ్లిన యూనివర్సిటీ విద్యార్థిని అక్కడ ఫుల్‌గా తాగింది. మత్తులో ఉన్న ఆమెకు ఓ వ్యక్తి ఆ పబ్‌లో పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తే ఈ కేసులో నిందితుడు. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లో ఉన్న ఆ వ్యక్తి.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. రెస్ట్ తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది. అయితే ఆ వ్యక్తి తనను అసభ్యకరంగా టచ్ చేశాడని, తన ఇంటికి బదులుగా బంధువుల ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసినట్లు ఆమె ఆరోపించింది. నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
బెయిల్ పిటీషన్లో నిందితుడు ఆ రోజు జరిగిన సంఘటనలను వివరించారు. ఫుల్‌గా తాగిన ఆ మహిళకు సపోర్ట్ అవసరమైన నేపథ్యంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లినట్లు అతను చెప్పాడు. బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లినట్లు చేసిన ఆరోపణలను అతను కొట్టివేశాడు. తానేమీ రేప్‌కు పాల్పడలేదని, కానీ ఇరువురం ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పాడు.
కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ..బాధితురాలు ఓ పీజీ విద్యార్థి అని, ఆమె చర్యలపై ఆమెకు అవగాహన ఉంటుందని తెలిపింది. కేసు పూర్వోపరాలు, పరిస్థితులు, సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని తీర్పును ఇస్తున్నట్లు జస్టిస్ పేర్కొన్నారు. పిటీషనర్ బెయిల్‌కు అర్హుడని, అందుకే అతని బెయిల్ పిటీషన్‌ను ఆమోదిస్తున్నట్లు జస్టిస్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
సీనియర్ అడ్వకేట్ వినయ్ సరన్, అడ్వకేట్ బాల్బీర్ సింగ్.. నిందితుడి తరపున వాదించారు.