All Party Meeting | పార్లమెంట్ శీతాకాల సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాడ్ చేసింది. శీతాకాల సమావేశాల్లో విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో సమావేశాలు స్తంభించే అవకాశం ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి కొత్త ఊరటనిచ్చాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, బీజేడీ తదితర పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.
శీతాకాల సమావేశాలు సోమవారం నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, మణిపూర్ హింసాకాండపై చర్చకు డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికా ఆరోపణలపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. గౌతమ్ అదానీ కేసుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ (JPC)తో విచారణ జరిపించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సమావేశానంతరం కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ అదానీ లంచాల కుంభకోణంపై సమావేశంలో చర్చకు అనుమతించాలని తమ పార్టీ ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు ఏర్పాటైన జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారం చివరిలో తన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నది. జేపీసీలో చేరిన విపక్ష ఎంపీలు నివేదిక సమర్పించేందుకు మరింత సమయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26న సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించే కార్యక్రమంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ సమావేశానికి 30 రాజకీయ పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారన్నారు. కొన్ని అంశాలపై నేతలు చర్చించాలన్నారు. కానీ, లోక్‌సభ, రాజ్యసభలో మంచి చర్చ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఏ అంశంపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.