India Pakistan Tension | న్యూఢిల్లీ, మే 11: భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా ప్రకటించడం పట్ల విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీని నిలదీశాయి. హఠాత్తుగా పాక్‌తో యుద్ధానికి స్వస్తి పలికి కాల్పుల విరమణ ప్రకటించడానికి కారణమేమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఇరు దేశాల సమస్యలపై ద్వైపాక్షికంగానే చర్చలు జరపాలంటూ గతంలో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని మోదీ ప్రభుత్వం వదిలేసిందా? మూడో దేశం జోక్యానికి తలుపులు తెరిచిందా? అని ప్రశ్నించాయి. యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ తాము చేసిన కృషే అంటూ శనివారం అమెరికా ప్రకటించడం, ఒక తటస్థ వేదికపై కలుసుకుని భారత్-పాకిస్థాన్ చర్చలు జరుపుతాయంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించడం, కశ్మీర్ వివాద పరిష్కారానికి తాను భారత్, పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి.
వెంటనే పార్లమెంట్‌ను సమావేశ పర్చాలి
పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. కాల్పుల విరమణపై వాషింగ్టన్ తొలి ప్రకటన చేయడం, తర్వాతే భారత్, పాకిస్థాన్‌లు స్పందించడం తదితర విషయాలను కూలంకషంగా చర్చించాలన్నారు. కాగా, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విపక్ష నేతలు మల్లిఖార్జున ఖర్గే (రాజ్యసభ), రాహుల్ గాంధీ (లోక్‌సభ) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. భారత్, పాక్ మధ్య చర్చలకు తటస్థ వేదిక అంశాన్ని యూఎస్ విదేశాంగ కార్యదర్శి ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తూ ఆయన చేసిన ప్రకటన పలు ప్రశ్నలు, అనుమానాలను రేకెత్తిస్తున్నదని పేర్కొంది.
‘అంటే మనం సిమ్లా ఒప్పందాన్ని విడిచిపెట్టేసినట్టేనా? ఈ రెండు దేశాల వివాదంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి తలుపులు బార్లా తెరిచినట్టేనా?’ అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఉన్న ఎలాంటి సమస్యలనైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని, అందులో మూడో దేశం ప్రమేయం, జోక్యం ఎంతమాత్రం ఉండరాదన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య దౌత్య మార్గాలు తిరిగి తెరుస్తున్నారా? ఇస్లామాబాద్ నుంచి భారత్ ఏవిధమైన నిబద్ధతలను పొందింది? వేటిని కోరింది? అని ఆయన ప్రశ్నించారు.
Sanjay Raut
దేశానికే అవమానం
మోదీ చర్య దేశానికే పెద్ద అవమానమని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మీకే కనుక ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, దానికి ప్రధాని మోదీ కచ్చితంగా హాజరు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ జోక్యం కారణంగా యుద్ధాన్ని ఆపేసినట్టు ప్రభుత్వం చెబుతున్నదని, అలాంటప్పుడు ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధాన్ని ట్రంప్ ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. ట్రంప్ జోక్యం మన దేశ సార్వభౌమత్వంపై దాడేనని, ఇది మన ప్రభుత్వ బలహీనతను చూపుతున్నదని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య వివాదంలో మూడో దేశం జోక్యం సహించరానిదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా అన్నారు. ప్రాంతీయ వివాదంలో బాహ్యశక్తుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించకూడదని ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జీ దేవరాజన్ పేర్కొన్నారు.