Justice Shekhar Kumar Yadav | న్యూఢిల్లీ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఆయనపై రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించిన పిటిషన్పై వివిధ పార్టీలకు చెందిన 36 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చొరవతో ఈ పిటిషన్ను రూపొందించారు. ఈ కూటమికి మొత్తం 85 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం.