న్యూఢిల్లీ, ఆగస్టు 19 : ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్‌ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్రించడం, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ బిల్లు ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ జరిగే ఆన్లైన్ గేమ్స్ నిర్వాహకులపై భారీగా జరిమానాలు విధించడం, శిక్షించడం, అవసరమైతే నిషేధించడం వంటి అంశాలను ఈ బిల్లులో చేర్చినట్టు వెల్లడించాయి.
కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించిన ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు. ఈ బిల్లు ద్వారా వినోదం ప్రధానమైన ఆన్లైన్ గేమ్స్‌కు, డబ్బుతో ప్రమేయం ఉండే ఇతర గేమ్స్‌కు మధ్య స్పష్టమైన గీత గీయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఆన్లైన్లో ఉన్న ఇతర గేమ్స్‌ను యథాతథంగా కొనసాగించనున్నారు.