న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ (C-Hexagon)తో పాటుతో పాటు పది మార్గాలు, రాజ్‌పథ్ సమీపంలోని మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే బస్సులను సైతం అనుమతించరని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ పండుగ సమయంలో కాకుండా మార్గాలను మూసివేయడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ 8న సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రత దృష్ట్యా ఆయా మార్గాలను మూసివేయడంతో పాటు రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలను సైతం మూసివేయనున్నారు. అయితే, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే రోజుసాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇండియా గేట్‌ను సైతం మూసివేయనున్నారు. పది రోడ్లు, రాజ్‌పథ్ చుట్టూ ఉన్న రోడ్లు సైతం మూసివేయనున్నారు. బస్సులను సైతం న్యూఢిల్లీకి అనుమతించరని అధికార వర్గాలు పేర్కొన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలుండడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచనలు ఇవ్వనున్నారని సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రధాని కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్‌పథ్ చుట్టూ ఉన్న కార్యాలయాలను మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయనున్నారని, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కార్యాలయాలను మూసివేయాలని ట్రాఫిక్ పోలీసులు కేంద్రాన్ని కోరినట్లు అధికారి పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీని గంటలపాటు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడంతో పాటు భద్రత కోసం రాష్ట్రపతి భవన్లో ఎంట్రీ డ్రోన్ క్షిపణులను మోహరించనున్నారు.