కోల్కతా : పశ్చిమ బెంగాల్లో మాజీ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగులగా, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీలికవర్గానికి న్యాయస్థానంలో గొప్ప ఊరట లభించింది. రెబల్ నేత రితబ్రత వర్గాన్నే తృణమూల్ కాంగ్రెస్ ఏకైక చట్టబద్ధమైన విభాగంగా గుర్తిస్తూ అలీపూర్ కోర్టు తీర్పు చెప్పింది. జూన్ 22న జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏర్పాటు చేసిన కమిటీయే పార్టీకి సంబంధించిన ఏకైక చట్టబద్ధమైన విభాగమని తీర్పు చెబుతూ.. ఆ వర్గానికే పార్టీ కార్యాలయాలు, నిధులపై నియంత్రణ కల్పిస్తున్నట్టు పేర్కొంది.
తమదే అసలైన పార్టీ విభాగంగా గుర్తిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల రితబ్రత ఆనందాన్ని వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఉత్తర్వు కాపీ వచ్చిన వెంటనే దానిని ఎన్నికల సంఘానికి పంపుతానని తెలిపారు. ఈ తీర్పు తర్వాత గుర్తింపు పొందిన కమిటీకి తప్ప మరెవరీకి తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సంస్థను నడిపే హక్కు లేదని ఆయన ఉద్ఘాటించారు. ఈ తీర్పుతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, నిధులపై తమకు పూర్తి నియంత్రణ వస్తుందన్నారు.