Al Falah University | ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో ఈ వర్సిటీ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో వర్సిటీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా షాక్ ఇచ్చింది.
ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించినందుకుగానూ యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (NAAC) షోకాజు నోటీసులు పంపింది. అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలకు నాక్ నుంచి A రేటింగ్ వచ్చిందని పేర్కొనడాన్ని తప్పుబట్టింది. ఇంజినీరింగ్ కళాశాల 2013లో ‘ఏ’ గ్రేడ్ అందుకుందని.. అయితే ఈ గ్రేడ్ 2018 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉందని నోటీసుల్లో పేర్కొంది.
అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌కు 2011లో ఏ గ్రేడ్ రాగా.. అది 2016 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వివరించింది. అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తన వెబ్సైట్లో కళాశాలకు గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించడాన్ని నాక్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించడమే అవుతుందని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ (Faridabad)లో గల ధౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1997లో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (NAAC) నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకుంది. 2014లో హర్యానా ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సులను ప్రారంభించారు. ఆ తర్వాత 2023లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ యూనివర్సిటీని అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు.
Also Read..
Al-Falah University | ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్ భవనం.. పథక రచన మొత్తం ఆ గది నుంచే..!
Delhi Blast | ఢిల్లీలో మరోసారి పేలుడు శబ్దం.. భయంతో వణికిపోయిన స్థానికులు.. చివరికి
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్