ప్రజాస్వామ్యాన్ని చంపేసే పార్టీ బీజేపీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును ఎలా లాక్కోవాలో బీజేపీకి బాగా తెలుసని, అందులో ఆ పార్టీ నిష్ణాతురాలని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. అసలు యూపీ ఎన్నికల్లో ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగాయని, బీజేపీ నుంచి పారదర్శకమైన ఎన్నికలను ఆశించడం ఓ బుద్ధి తక్కువ పని అని, మోసం చేసుకోవడమే అవుతుందని ఘాటుగా విమర్శలు చేశారు.
పెట్రో, డీజిల్ ధరలను బీజేపీ ప్రభుత్వం విపరీతంగా పెంచేసిందని, దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతుందని గతంలోనే పేర్కొన్నానని, అన్నట్టే మోదీ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచేసిందని ఆయన విమర్శించారు. యూపీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి చెందిన టోపీపై ప్రధాని మోదీ అనేక విమర్శలు చేశారని, ఇప్పుడు బీజేపీ వాళ్లే కాషాయ టోపీలను పెట్టుకున్నారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు.