లక్నో, మార్చి 25 : తగలబడిపోతున్న గుడిసెలో చిక్కుకున్న హీరోయిన్ను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని హీరోలను మనం సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఓ ఏడేళ్ల బాలిక చేసిన సాహసం మాత్రం ఎవరూ ఊహించనిది, అనితర సాధ్యమైనది. పక్కింటి గుడిసె కాలిపోతుండగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న తన గుడిసెలో ఉన్న పాఠ్యపుస్తకాలను తెచ్చుకునేందుకు ఆ బాలిక చూపిన సాహసం సోషల్ మీడియా యూజర్లను విస్మయానికి గురిచేసింది. చదువు పట్ల ఆ పేద బాలికకున్న నిబద్ధతను చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అక్రమ నిర్మాణాల పేరుతో అంబేద్కర్ నగర్లోని అరై గ్రామంలో యోగి సర్కారు పేదలకు చెందిన గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో గుడిసెకు మంటలు అంటుకోగా వాటిని ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా దాన్ని ఆనుకునే ఉన్న మరో గుడిసెలోకి అనన్య అనే ఏడేళ్ల బాలిక పరుగులు పెట్టి తన పుస్తకాలు ఉన్న స్కూలు బ్యాగును తెచ్చుకున్నది. తాను వెళ్లి తెచ్చుకోకపోతే తన పుస్తకాలు కూడా కాలిపోతాయని, తన చదువు ఆగిపోతుందని ఆ బాలిక ఆవేదక వ్యక్తంచేసింది. ఎస్పీఅధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ ఈ వీడియోను షేర్ చేస్తూ బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా అని విమర్శించారు.