Akhilesh Yadav | త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిందీలో ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి బలమైన 11 స్థానాల్లో సీట్ల కేటాయింపుతో సహృదయ కూటమి అవుతుంది. ఇది ఎన్నికల్లో విజయానికి ముందడుగు అవుతుంది. ‘ఇండియా’ టీం, ‘పీడీఏ’ వ్యూహం చరిత్రను మార్చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్-మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి.
బీహార్లో సీఎం-జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ మరో దఫా బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో అఖిలేశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 2022లో బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీతో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.