న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఆరో తేదీన ఇండియా కూటమి(India Alliance) భేటీకి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మీటింగ్ గురించి తనకు తెలియదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇక ఇప్పుడు ఆమె బాటలోనే మిగితా కూటమి నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఇండియా కూటమి భేటీకి డుమ్మా కొట్టనున్నారు. ఆ ఇద్దరూ ఆ భేటీకి తమ ప్రతినిధుల్ని పంపనున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఇండియా బ్లాక్ భేటీకి వెళ్లే ఆలోచనలో అఖిలేశ్ లేరని ఆ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరీ తెలిపారు.
ఇండియా కూటమి భేటీపై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఇండియా కూటమి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మూడుసార్లు కలిసి టీ తాగారని, ఆ తర్వాత కూటమి అయ్యారన్నారు. ఆ కూటమికి నితీశ్ నాయకత్వం వహించారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. నితీశే మీటింగ్లకు హాజరుకావడం లేదని దిలీప్ అన్నారు. మమతా బెనర్జీ కూడా వెళ్లడం లేదని, ఆ కూటమి నేతలంతా కన్ఫ్యూజన్లో ఉన్నారని దిలీప్ ఆరోపించారు.