లక్నో, ఫిబ్రవరి 3: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఓ బలమైన నమ్మకం ఉన్నది. సిట్టింగ్ సీఎం ఎవరైనా నోయిడా పర్యటనకు వెళ్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతుంది. అధికారంలోకి రాదు. దీనిని పత్రికా పరిభాషలో, రాజకీయ వర్గాల్లో ‘నోయిడా అపశకునం’గా పిలుస్తున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడల్లా ‘నోయిడా అపశకునం’ అంశం తెరమీదకు వస్తున్నది. దీన్ని అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు చాలా బలంగా నమ్ముతారు. అయితే, సీఎం యోగి 2017లో అధికారంలోకి వచ్చాక దీన్ని బ్రేక్ చేశారు. నోయిడాలో పలుమార్లు పర్యటించారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. యోగికి ఓటమి తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.
నమ్మకానికి మూలం ఏంటి?
1980ల్లో ఇద్దరు సీఎంలు వీర్ బహదూర్ సింగ్, ఎన్డీ తివారీ.. తమ నోయిడా పర్యటన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడే నోయిడా పర్యటనకు వెళ్తే అపశకునం అన్న విశ్లేషణలు వచ్చాయి. కల్యాణ్ సింగ్, మాయావతికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. దీంతో నమ్మకం బలపడింది. అయితే, దీనిపై వేరే రకమైన ప్రచారం కూడా ఉన్నది. ‘నోయిడా సంపన్నులు, ఉన్నతాధికారులు ఉండే ప్రాంతం. రాజకీయ నాయకులు అక్కడికి ప్రచారానికి వెళ్లడం స్థానికులకు ఇష్టం ఉండదు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ నమ్మకాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు’ అని కొందరు చెప్తున్నారు.
నోయిడా శుభసూచకమే
గురువారం నోయిడా పర్యటకు వెళ్లడానికి ముందు అఖిలేశ్ విలేకరులతో మాట్లాడారు. ‘నోయిడా అపశకునం మాట ఎలా ఉన్నా.. అక్కడికి ప్రచారానికి వెళ్తే ఆ పార్టీ తప్పక గెలుస్తుంది. 2011లో నేను అక్కడ పర్యటించా. 2012లో మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడికి పర్యటనకు వెళ్తున్నా. ఈ సారి కూడా గెలుస్తాం’ అన్నారు.