లక్నో : కశ్మీర్ పండిట్లపై కశ్మీర్ ఫైల్స్ మూవీ ముందుకొస్తే లఖింపూర్ ఫైల్స్‌ను కూడా తెరకెక్కించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓటమి అనంతరం అఖిలేష్ బుధవారం తొలిసారిగా సీతాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్‌ను మూవీగా మలిచినప్పుడు ఆందోళన సాగిస్తున్న రైతులపై జీపు దూసుకెళ్లిన ఘటన జరిగిన లఖింపూర్ ఫైల్స్‌పై సినిమా ఎందుకు రాకూడదని ఆయన ప్రశ్నించారు.
గత ఏడాది అక్టోబర్ 3న సాగు చట్టాలపై ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి ఎస్యూవీ దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం హింసాకాండ చెలరేగడంతో పలువురు మరణించారు. ఇక ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు, ఓట్లు పెరిగాయని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఓటర్ల మద్దతుతో తాము నైతిక విజయం సాధించామని, రాబోయే రోజుల్లో బీజేపీ సీట్లు మరిన్ని తగ్గుతాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పాలక పార్టీ ధరల మంట, యువతకు ఉపాధి వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఇక కశ్మీరీ పండిట్ల బాధను ఆక్రోశంగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రమోట్ చేస్తోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. పాత గాయాన్ని మాన్చేందుకు ప్రయత్నించి ఇరు వర్గాల మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య విభజన పెరిగేలా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.