UP Polls | యూపీలో ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమాజ్‌వాదీకి క్యూ కడుతున్నారు. తమ సైకిల్ అద్భుతంగా ఉందని, ప్రస్తుతం మరింత బలపడిందని సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రకటించారు. అంతా బాగానే వుంది. ఇంతకు అఖిలేశ్ యాదవ్ ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగుతారా? దిగరా? అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకు పూర్వం ఇదే విషయంపై పార్టీలో చర్చలు జరగ్గా… తాను ఎన్నికల పోటీలోకి రావడం లేదని, అభ్యర్థులందరికీ మార్గనిర్దేశనం మాత్రమే చేస్తుంటానని ప్రకటించారు. తాజాగా.. ఇదే విషయంపై బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అఖిలేశ్‌ను అడగ్గా.. ‘ఆజంఘర్ ప్రజలను అడిగి చెబుతానన్నారు. ఇదమిత్థంగా మాత్రం పోటీలో నిలుస్తారా? లేదా? అన్నది మాత్రం చెప్పలేదు. ఎన్నికల గోదాలోకి దిగాలనుకుంటే మాత్రం నేను ఆజంఘర్ ప్రజల నుంచి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే ఆ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.
ప్రస్తుతానికైతే ఏ స్థానం నుంచి అఖిలేశ్ బరిలోకి దిగాలన్నది మాత్రం ఇంకా డోలాయమానంలో ఉందని ఓ వర్గం పేర్కొంటోంది. అయితే మరో వర్గం మాత్రం మరో రకంగా చెబుతోంది. వచ్చే ఎన్నికలను అఖిలేశ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, రెండు నియోజకవర్గాల నుంచి ఆయన కచ్చితంగా బరిలోకి దిగుతున్నారని పేర్కొంటున్నారు. ఒకటి ఆజంఘర్ , మరొకటి మైన్‌పురీ సీటు నుంచి బరిలోకి దిగాలన్నది అఖిలేశ్ ప్లాన్‌గా చెబుతున్నారు. ఆజంఘర్ నుంచి పోటీకి దిగడం ద్వారా పూర్వాంచల్‌పై పట్టు సాధించడానికి వీలవుతుందని, ఇక మైన్‌పురీ నుంచి పోటీకి దిగడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కంచుకోటగా వున్న నియోజకవర్గాన్ని కాపాడుకున్నట్లూ వుంటుందన్నది అఖిలేశ్ వ్యూహకర్తల మాటగా చెబుతున్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నా, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ పోటీ చేసే వ్యవహారం తెమలడం లేదు. ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి, పార్టీలో చేరుతున్నా.. పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే విషయంలో క్లారిటీ లేకపోవడం సమాజ్‌వాదీకి ఓ విధంగా లోటే. సమాజ్‌వాదీ ప్రత్యర్థి వర్గమైన బీజేపీ.. ఓ అడుగు ముందుకు వేసి సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య.. ఇద్దరూ బరిలోకి దిగాల్సిందేనని తేల్చి చెప్పింది. బరిలోకి దిగేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు కూడా. దీంతో పరోక్షంగా అఖిలేశ్‌ను బీజేపీ ముగ్గులోకి లాగినట్లైంది. దీంతో అఖిలేశ్ పోటీకి సిద్ధమవ్వడం మినహా గత్యంతరం లేకపోయింది. అయితే పోటీపై మాత్రం అఖిలేశ్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.