అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుల్లో ఏ ఒక్కరికీ సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుడి తండ్రికి సమాజ్‌వాదీతో సంబంధాలున్నాయని, ఆయన ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తున్నాడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ పై విధంగా స్పష్టం చేశారు. ‘అహ్మదాబాద్ వరుస పేలుళ్ల నిందితుల్లో ఏ ఒక్కరికీ మా పార్టీతో సంబంధాల్లేవ్. నేను మొదటి నుంచీ చెబుతూనే వున్నా. అబద్ధాలు చెప్పే ఏకైక పార్టీ బీజేపీ అని. బీజేపీ మాత్రమే అబద్ధాలు చెబుతుంది. అబద్ధాలు తప్ప వారు ఏవీ చెప్పరు. రైతుల్లో బీజేపీకి ఆదరణ లేదు. వారు తుడిచిపెట్టుకుపోతారు’ అంటూ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్లకు. సమాజ్‌వాదీ నేతలకు లింక్ ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని, ఏమాత్రం ఉపేక్షించమని పునరుద్ఘాటించారు. అహ్మదాబాద్ వరుస పేలుళ్లపై కోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.