లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బలరాంపూర్‌లో ప్రారంభించిన సరయూ ప్రాజెక్టు విషయంలో బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. సమాజ్‌వాదీ ప్రభుత్వ హయాంలో 70 శాతం పైగా ప్రాజెక్టు పనులు పూర్తయితే కాషాయ పార్టీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. 1978లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగా దశాబ్ధాలుగా పాలకుల నిర్లక్ష్యంతో ముందుకు కదలలేదని కేంద్రం చెబుతోందని, ప్రాజెక్టు జాప్యానికి గత ప్రభుత్వాలే కారణమని నిందిస్తున్నారని కానీ తమ హయాంలోనే నాలుగింట మూడొంతుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని అఖిలేష్ ట్వీట్ చేశారు.
మరికొద్ది నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాబోయే ఏడాది యూపీలో నూతన ఒరవడి నెలకొనబోతోందని అఖిలేష్ పేర్కొన్నారు. తాము యువతకు ల్యాప్‌టాప్‌లు అందిస్తే బీజేపీ లాఠీలతో వారిపై విరుచుకుపడుతోందని దుయ్యబట్టారు. రైతులను లాఠీలతో కుళ్లబొడిచి వాహనాలతో తొక్కించి చంపుతోందని లఖింపూర్ ఖేరి ఘటనను ప్రస్తావిస్తూ కాషాయ పార్టీపై ఆరోపణలు గుప్పించారు.
ఎస్పీ అభివృద్ధిని నమ్ముతుంటే బీజేపీ పేర్ల మార్పుపై దృష్టిపెడుతోందని ఎద్దేవా చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపవుతుందని బీజేపీ ప్రగల్బాలు పలికిందని ఆదాయం పెరిగిన రైతులు ఎక్కడున్నారని అఖిలేష్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల కంటే ప్రకటనలపైనే బీజేపీ ఎక్కు వ ఖర్చుచేస్తోందని అన్నారు. యువతకు ఉపాధి లభిస్తోందని భారీ హోర్డింగ్‌లతో ఊదరగొడుతున్నారని యూపీలో వారు ఎక్కడ ఉద్యోగాలిచ్చారో చెప్పాలని యోగి సర్కార్‌ను అఖిలేష్ నిలదీశారు.