Sunetra Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం – ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్.. రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బారామతి లోక్‌సభా స్థానం నుంచి శరద్ పవార్ తనయ సుప్రియా సూలే చేతిలో ఓటమి పాలైంది. సునేత్ర పవార్, సుప్రియా సూలే వదినా మరదళ్లు కావడం గమనార్హం.
‘మహారాష్ట్ర నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సునేత్ర పవార్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని ఎన్సీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో నేనే పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నా, కానీ, బుధవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో సునేత్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు’ అని రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత చగన్ భుజ్‌బల్ చెప్పారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు భుజ్‌బల్ స్పందిస్తూ.. ‘ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. నేను స్వతంత్ర వ్యక్తిని కాను. కానీ, నేనొక పార్టీ నాయకుడిని. కార్యకర్తను’ అని పేర్కొన్నారు. అసోం, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రెండేసి, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో స్థానం భర్తీ కోసం రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.