ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాయుతి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీల మధ్య లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయి. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) విభేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం క్యాబినెట్ సమావేశం ప్రారంభమైన పది నిమిషాల తర్వాత ఆయన వాకౌట్ చేశారు. విరార్ – అలీబాగ్ కారిడార్ ప్రాజెక్ట్ ఈ వివాదానికి కారణంగా తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం షిండే ఆదేశించారు.
కాగా, ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న అజిత్ పవార్ ఆ ఫైల్‌పై ఇంకా సంతకం చేయలేదని తెలుస్తున్నది. దీంతో శుక్రవారం మంత్రివర్గం సమావేశంలో ఈ విషయంపై చర్చ జరుగడంతో అజిత్ పవార్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అలాగే సాయంత్రం 6.30 గంటలకు మీడియా సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకోవచ్చని అంతా భావిస్తున్నారు.
మరోవైపు అజిత్ పవార్‌ను పక్కన పెట్టేందుకు బీజేపీ, శివసేన ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఆయన వీడవచ్చన్న టాక్ వినిపిస్తున్నది. ఇదే జరిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాయుతి ప్రభుత్వం కూలిపోయే అవకాశమున్నది.