Ajit Pawar : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య వార్ జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చిన విషయాన్ని గుర్తుచేసుకుని శరద్‌పవార్ విమర్శలు గుప్పించగా.. నేను ఆయనను దేవుడిలా భావిస్తుంటే.. ఆయన నన్నే ఎగతాళి చేస్తారా..? అని అజిత్ పవార్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన గురించి తన బాబాయ్ శరద్ పవార్ వ్యంగ్యంగా స్పందించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన నన్ను అలా వెక్కిరించడం చాలా బాధించిందని అన్నారు.
‘నేను శరద్‌పవార్ (Sharad pawar) ను దేవుడిలా భావిస్తున్నాను. కానీ ఆయన మాత్రం కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని వెక్కిరించారు. ఎవరో చిన్న నేతలు అలా చేస్తే ఏమోకానీ.. ఆయన లాంటి అనుభవజ్ఞుడు నన్ను అలా ఎగతాళి చేయడం చాలా మందికి నచ్చలేదు. ఓ కార్యక్రమంలో అమ్మపేరు చెప్పగానే నేను ఉద్వేగానికి గురయ్యాను. కన్నీరొచ్చింది. అది సహజం. కొన్నిసార్లు అలా జరుగుతుంది. రాజ్ ఠాక్రే మాత్రమే అలా అనుకరిస్తారని నేను అనుకునేవాడిని. కానీ శరద్ పవార్ కూడా అలాగే వ్యవహరించారు’ అని అజిత్ పవార్ ఆవేదన వెలిబుచ్చారు.
కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన అజిత్‌పవార్ ఉద్వేగానికి గురయ్యారు. కర్చీఫ్ తీసుకొని ముఖం తుడుచుకున్నారు. దాన్ని తాజాగా శరద్ పవార్ అనుకరిస్తూ అజిత్ పవార్‌పై విమర్శలు గుప్పించారు. తాను తన సోదరుల సహకారంవల్లే పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టగలిగానని.. వారి పిల్లలపట్ల ఎప్పుడూ వివక్ష చూపలేదని అన్నారు. పార్టీలో ఉన్న పలువురు నేతలకు ఉన్నత పదవులు ఇచ్చినా.. తన కుమార్తె సుప్రియా సూలేకు ఒక్క పదవి కూడా అప్పగించలేదని పేర్కొన్నారు. తాను స్థాపించిన ఎన్సీపీ గుర్తును తనకు కాకుండా చేసి కోర్టుకు లాగారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో గెలుపొంది నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా అజిత్ పవార్‌కు పదవిపై కాంక్ష తగ్గలేదని శరద్‌పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి ఆయన ఇతరులతో చేయి కలపడాన్ని తప్పుపట్టారు. నాలుగు సార్లు పదవిలో ఉండి కూడా ఒక్కసారి పదవి దూరమైతే దానికోసం కుటుంబాన్ని చీల్చుతారా..? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.