లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు అలహాబాదు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. సరిగ్గా యూపీ మొదటి దశ పోలింగ్ రోజునే ఈ బెయిల్ రావడంతో విమర్శలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఈ విషయంపై స్పందించమని అడిగింది. ఎన్నికల్లో భాగంగా ఆయన లఖీంపూర్‌లో ప్రచారం చేశారు. ఈ సమయంలో ఆయన్ను బెయిల్ విషయంపై స్పందించమనగా.. ఓ నవ్వు నవ్వి, కారు ఎక్కి, ప్రచారం కోసం వెళ్లిపోయారు.
ఇదే విషయంపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కూడా స్పందించారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొందరగా బెయిల్ దొరికేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక కోర్టు తీర్పుపై ఏం మాట్లాడతాం? బెయిల్ ఇచ్చేశారు. 302 సెక్షన్ కింద ఇతరులకు కూడా ఇలాగే బెయిల్ దొరికితే సంతోషం. ఇలాగే బెయిల్ దొరకకుంటే ఇక చూసుకోండి అంటూ రాకేశ్ టికాయత్ ఫైర్ అయ్యారు. ఇక.. యూపీ ప్రచారంలో ఈ అంశాన్ని తెరపైకి తెస్తామని, ఇంత తొందరగా ఏ సాక్ష్యాలు దొరికాయని బెయిల్ వచ్చిందని రాకేశ్ టికాయత్ సూటిగా ప్రశ్నించారు.
మా రైతుల వద్ద ఇంత పెద్ద లాయర్ లేరని, ఎదుటి వారు చాలా పెద్ద హోదాలో ఉన్నారని దెప్పి పొడిచారు. వారు ప్రభుత్వంలో ఉన్నారని, పెద్ద పెద్ద లాయర్లను వాదించడానికి పెట్టుకున్నారని, అందుకే బెయిల్ దొరికిందేమోనన్నారు. కోర్టులు మాత్రం సాక్ష్యాల ఆధారంగానే నడుస్తాయన్నారు. రైతుల పక్షాన ఎవరు పైరవీలు చేస్తారు? వారి దగ్గర32 మంది న్యాయవాదులున్నారని టికాయత్ పేర్కొన్నారు.