Airport Advisory | జాతీయ రాజధాని ఢిల్లీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 300 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దాంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ప్రభావం ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కూడా కనిపించింది. దాంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు. ఈ క్రమంలో ముంబయి విమానాశ్రయం అడ్వైజరీ జారీ చేసింది. ‘ఢిల్లీలోని ఆటోమేటెడ్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో సాంకేతిక సమస్య కారణంగా మంబయిలో విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఈ వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సహాయపడుతుంది. అధికారులు సమస్యను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు అప్డేట్స్ అందుకున్న తర్వాత మాత్రమే ఫ్లయిట్ స్టేటస్, సవరించిన షెడ్యూల్‌ను చెక్ చేయాలి. అవసరమైన సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థలను సంప్రదించాలి’ అని సూచించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే విమానాశ్రయ నిర్వహణలో సహాయం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది. ఎయిర్‌లైన్స్ ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్ శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో తమ విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నాయి.
దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) రోజుకు 1,500కి పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాను సపోర్ట్ చేసే ఆటోమేటిక్ స్విచింగ్ (AMSS)లో సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఏఏఐ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ సేవలను అందిస్తుంది. వీలైనంత త్వరగా వ్యవస్థను పునరుద్ధరించడానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) నిర్వహిస్తున్నది.