న్యూఢిల్లీ : ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా సహా అనేక విమానయాన సంస్థలు ఈ మేరకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి. విమానం బయల్దేరడానికి 75 నిమిషాల ముందు చెక్‌ఇన్‌ను క్లోజ్ చేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశాల నేపథ్యంలో విమానయాన సంస్థలు ఈ అడ్వయిజరీని ప్రకటించాయి. విమానాశ్రయాల టెర్మినల్ భవనంలోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు బీసీఏఎస్ ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లను మెరుగుపర్చటంలో భాగంగా అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్‌ను బీసీఏఎస్ తప్పనిసరి చేసింది. దేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, వైమానిక దళ స్టేషన్లు, హెలిప్యాడ్స్, ఏవియేషన్ శిక్షణ కేంద్రా లు..సహా అన్ని పౌర విమానకేంద్రాల వద్ద భద్రతా చర్యలను పెంచాలని నిర్ణయించాం’ అని బీసీఏసీ పేర్కొన్నది.