Air strikes : పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ముజఫరాబాద్ (Muzzafarabad) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) విరుచుకుపడింది. ఈ దాడిని ముజఫరాబాద్ వాసులు గుర్తుచేసుకున్నారు. ఒక్కసారిగా క్షిపణుల వర్షం కురవడంతో తాము ఆందోళనకు గురయ్యామని చెప్పారు.
‘ఒక్కసారిగా ఇక్కడ క్షిపణుల వర్షం కురిసింది. ఇక్కడ (ముజఫరాబాద్‌లో) ఏకంగా 10 నుంచి 15 క్షిపణులు ఢీకొట్టాయి. వరుసగా క్షిపణుల వర్షం కురుస్తుండటంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యాం.’ అని స్థానికుడు అహ్మద్ అబ్బాసీ చెప్పారు. క్షిపణుల దాడితో ముజఫరాబాద్‌లో పలు స్థావరాలు ధ్వంసమయ్యాయని, అందులో స్థానిక మసీదు కూడా ఉన్నదని అబ్బాసీ తెలిపారు.
బెయిత్ ఉల్ ముజాహిదీన్‌గా పేరున్న షవాయ్ నల్లాహ్ క్యాంప్ కూడా ముజఫరాబాద్లోనే ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లష్కరే స్థావరాల్లో అది అతి ముఖ్యమైనదని, ముంబై 26/11 దాడికి పాల్పడిన అఫ్జల్ కసబ్ తదితర ఉగ్రవాదులు ఈ క్యాంపులోనే శిక్షణ పొందారని అంటున్నారు. కాగా పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఛౌదరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భారత వైమానిక దాడులను ధృవీకరించారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 24 క్షిపణులను ప్రయోగించారని చెప్పారు.