న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా హస్తిన వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ పటాకులు కాల్చారు. దీంతో తీవ్రమైన శబ్దకాలుష్యంతోపాటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. శుక్రవారం ఉదయం దట్టమైన పొగ కమ్మేసింది. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కన్పించలేనంత పరిస్థితి నెకొన్నది. చాలా ప్రాంతాల్లో ఎయిల్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటేసింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఆర్కే పురం ప్రాంతంలో గాలి నాణ్యత సూచి (AQI) 395 పాయింట్లకు చేరుకున్నది. దీంతో పరిస్థితిని ‘తీవ్రంగా’ పేర్కొన్నారు. అలాగే బురారీ, సోనియా విహార్, పంజాబీ బాగ్, నార్త్ క్యాంపస్, బవానా, జహంగీర్‌పురి, రోహిణి, అశోక్ విహార్, నెహ్రూ నగర్లో సూచీ 350 పాయింట్లకు పైనే ఉండటం గమనార్హం. గజియాబాద్, గురుగ్రామ్, నోయిడాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నది. గురువారం అర్ధరాత్రి నుంచి ఏక్యూఐ పడిపోతూ వచ్చింది.
ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా వాయుకాలుష్యం తీవ్ర సమస్యగా మారుతుంది. పెద్ద మొత్తంలో పటాకులు కాల్చడం వల్ల గాలిలో హానికరమైన రసాయనాలు పెరుగుతాయి. దీని వల్ల కాలుష్యం అనేక రెట్లు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏటా ఢిల్లీలో పటాకుల తయారీ, అమ్మకాలు, వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ వస్తున్నది. ఇసారీ పటాకులను ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయినా ప్రజలు ఆంక్షలు పట్టించుకోకుండా పటాకులు పెద్దమొత్తంలో కాల్చడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
#WATCH | Delhi: A layer of smog engulfs the Anand Vihar area of the National Capital.
The Air Quality Index of Anand Vihar is 396 in the ‘Very Poor’ category as per the CPCB. pic.twitter.com/SIMbd1hsjQ
— ANI (@ANI) November 1, 2024