న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానానికి సంబంధించి దాని పైలట్ ఆడియో సందేశం ఒకటి బయటికొచ్చింది. కేవలం ఐదు సెకన్ల వ్యవధి ఉన్న ఆ మెసేజ్‌లో కెప్టెన్ సమిత్ సభ్రావల్ మాట్లాడుతూ ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్(కిందకు వెళ్లి పోతోంది)’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే విమానం కూలిపోయింది.
ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం గురువారం అహ్మదాబాద్‌లో కూలడానికి ముందు అందులో ఎలాంటి సమస్యలు కనిపించలేదని పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతకుముందే అది పారిస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించినట్టు పేర్కొంది. విమాన దుర్ఘటన తర్వాత తొలిసారి శనివారం మీడియా సమావేశం నిర్వహించిన పౌర విమానయాన శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. విమానం కూలిపోవడానికి ముందు పైలట్ ‘మేడే’ కాల్ చేశారని, వెంటనే అప్రమత్తమైన ఏటీసీ పైలట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించ లేదని విమానయానశాఖ కార్యదర్శి సమీర్‌కుమార్ తెలిపారు. విమానం టేకాఫ్ అయిన నిమిషం తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలోని మేఘని నగర్లో కూలిపోయినట్టు వివరించారు.