Air India | ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. సంబంధిత విమానం పైలట్ తన డ్యూటీ టైం అయిపోయిందంటూ, విమానం నడిపేందుకు తిరస్కరించడంలో తలెత్తిన వివాదం ఒక రోజు ఆలస్యంగా బయట పడింది. సోమవారం జరిగిన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. పైలట్ సహాయ నిరాకరణతో కొన్ని గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత బస్సులో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ విషయమై ఎయిర్ ఇండియా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రయాణికులను విమానంలో తీసుకెళ్లడం అంటే బస్సు కంటే ఎక్కువ సమయం పడుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
ఆదివారం రాత్రి 10 గంటలకు పారిస్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10.35 గంటలకు ఢిల్లీకి చేరుకోవాలి. కానీ ఉదయం వేళ ఢిల్లీలో పొగ మంచు వల్ల దృశ్య గోచరత లోపించడంతో విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి తరలించారు. జైపూర్ విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించేందుకు డ్యూటీ సమయం ముగిసిన తర్వాత పైలట్లు నిరాకరించారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం అలసటతో కూడిన సేఫ్టీ సమస్యలు తలెత్తకుండా విమాన క్రూ సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలి. కానీ, తమకు ప్రత్యామ్నాయ విమాన సర్వీసు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన తెలిపారు.