న్యూఢిల్లీ: అర్హత లేని పైలట్లతో విమానాన్ని నడిపినందుకుగాను టాటా గ్రూప్ యాజమాన్యంలోని ‘ఎయిర్ ఇండియా’పై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానయాన భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసినందుకు రూ.90 లక్షలు జరిమానా విధించింది. ఆ సంస్థ అధికారులు పంకుల్ మాథుర్‌కు రూ.6 లక్షలు, మనీశ్ వాసవడకు రూ.3 లక్షలు ఫైన్ విధించినట్టు డీజీసీఏ శుక్రవారం తెలిపింది. ఎయిర్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఓ నాన్-ట్రెయినర్ లైన్ క్యాప్టన్, నాన్-లైన్ ఫస్ట్ ఆఫీసర్‌తో ఓ విమానాన్ని నడిపినట్టు తేలింది.
ఇంకా చదవల్సిన వార్తలు
‘జ్ఞానవాపీ వాజుఖానాలో సర్వేకు వీల్లేదు’
ప్రయాగ్‌రాజ్: జ్ఞానవాపీ మసీదు వాజుఖానాలో ఏఎస్ఐ సర్వే చేయడానికి అనుమతి లేదని అలహాబాద్ హైకోర్టుకు మసీదు నిర్వహణ కమిటీ తెలిపింది. ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నందున, సర్వే చేయడానికి వీల్లేదని పేర్కొన్నది. వాజుఖానాలో సర్వే నిర్వహించడానికి అనుమతి కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఏఎస్ఐ (పురావస్తు శాఖ) ఆశ్రయించింది. దీనిపై గురువారం అంజుమన్ ఇంతెజామియా కమిటీ కౌంటర్ దాఖలు చేసింది. వాజుఖానా, శివ లింగానికి సంబంధించిన అంశాలు సుప్రీంవిచారణలో ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని వారణాసి కలెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించినట్టు తెలిపింది.
‘కించపరిచే ఉద్దేశం ఉంటేనే ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తింపు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ (దౌర్జన్యాల నిరోధం) చట్టం ప్రకారం ఏ ఫిర్యాదునైనా నేరంగా పరిగణించాలంటే కేవలం ఫిర్యాదుదారు ఎస్సీ లేదా ఎస్టీ అయినంత మాత్రాన సరిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఫిర్యాదుదారును కించపరిచే ఉద్దేశం నిందితునికి లేనిదే ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన కేసులో యూట్యూబర్ షాజన్ స్కరియాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనకు ముందస్తు బెయిల్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించడంపై షాజన్ చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.