న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో నిరుడు జూన్ 12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటనలో ప్రమాద కారణం ఇంకా తెలియలేదు. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం వీలైతే ఒక సంవత్సరం లోగా తుది దర్యాప్తు నివేదికను ప్రచురించాలి. అది వీలు కాకపోతే దర్యాప్తు పురోగతిని తెలుపుతూ మధ్యంతర నివేదికను వెలువరించాలి. ప్రస్తుతం అమెరికాలో విమానం జీఈ ఏరోస్పేస్ ఇంజిన్లను పరీక్షిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం మూడు నెలల్లో తుది నివేదిక వెలువడే అవకాశం ఉంది. ఆధునిక జెట్ ఇంజిన్లను విశ్లేషించడం ప్రమాద కారణాన్ని తెలుసుకోవడంలో కీలకమని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ప్రాథమిక నివేదిక ప్రకారం కాక్‌పిట్‌లోని రెండు ఇంధన నియంత్రణ మీటలు రన్ స్థితి నుంచి కట్-ఆఫ్ స్థితికి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆ స్విచ్‌లను ఎవరు, ఎందుకు మార్చారు అనే ప్రశ్నలకు సమాధానాన్ని ప్రాథమిక నివేదిక ఇవ్వలేకపోయింది. మరోవైపు ప్రమాదం జరిగి సంవత్సరం అయిన సందర్భంగా విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో(ఏఏఐబీ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దర్యాప్తులో గణనీయమైన పురోగతి ఉందని తెలిపింది. విస్తృత, క్షుణ్ణమైన పరిశీలన చేస్తున్నట్టు చెప్పింది.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక మృత్యుంజయుడు 39 ఏండ్ల రమేశ్ ఇప్పుడు ఎలా ఉన్నాడని మీడియా ఆరా తీసింది. పచ్చిగా ఉన్న చేదు జ్ఞాపకాలతో నిత్యం నరకం చూపుతున్న బాధలను ఆ ఒకే ఒక్కడు మీడియాతో పంచుకున్నారు. ‘ఇప్పటికీ నిద్రలేమి, ఆందోళన, చేదు జ్ఞాపకాలతో బాధపడుతున్నాను. ప్రమాదంలో నా సోదరుడిని పోగొట్టుకున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ‘మూసి ఉన్న తలుపుల వెనుక నాలుగు గోడల మధ్య ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను.
అవి ఎవరికీ కనబడవు. నేను ఇప్పటికీ నా జీవితాన్ని పునః నిర్మించుకోవడానికి, నా కుటుంబానికి అండగా నిలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను’ అని ఆయన తెలిపారు. ‘నేను బతికుండటం గ్రేటే. అయితే బతికి బయటపడటం నా కథలోని ఒక భాగం మాత్రమే. అప్పటి నుంచి నేను ఎదుర్కొన్న ఇబ్బందులను, అనుభవిస్తున్న నరకాన్ని మాటల్లో చెప్పలేను. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.