న్యూఢిల్లీ: ప్రయాణికులతో వెళుతున్న రెండు వేర్వేరు విదేశీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు శనివారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. దక్షిణ కొరియాలో ఆదివారం ఉదయం విమాన ప్రమాదం సంభవించి 179 మంది ప్రయాణికులు మరణించిన ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు విమాన ప్రయాణికుల భద్రతపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. న్యూఫౌండ్‌ల్యాండ్ దీవిలోని సెయింట్ జాన్స్ నగరం నుంచి నోవా స్కాటియా ప్రావిన్సులోని గాఫ్స్లో హాలిఫాక్స్ విమానాశ్రయానికి వస్తున్న ఎయిర్ కెనడాకు చెందిన విమానం శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి మంటల్లో చిక్కుకుంది.
ల్యాండ్ అవుతుండగా టైర్లు రన్‌వేపై సరిగ్గా దిగకపోవడంతో విమానం ఒక పక్కకు ఒరిగిపోయి ముందుకు దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రన్‌వేను దాటేసిన విమానం సురక్షిత ప్రదేశంలో నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. విమానం ఎడమ భాగంలో మంటలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించినట్టు అధికారులు తెలిపారు.
నార్వేలోని ఓస్లో నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్ వెళుతున్న కెఎల్ఎం డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఎదుర్కొంది. దీంతో టార్ప్ శాండెఫ్జార్డ్ ఎయిర్‌పోర్టుకు విమానాన్ని మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో రన్‌వేపై అదుపుతప్పి విమానం ముందుకు దూసుకువెళ్లింది. రన్‌వేను దాటేసిన విమానం ట్యాక్సీవే సమీపంలోని గడ్డినేలను చేరుకుని అక్కడ నిలిచింది. విమానంలోని 182 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.